Thursday, July 16, 2009

"చందన్ సా బదన్... చంచల్ చిత్ వన్... థీరేసే తేరీ ముస్‌కానా..." బాత్‌రూంలో స్నానం చేస్తూ హమ్మింగ్ చేస్తున్నట్లు మెల్లగా పాడుతున్నది హసీనా.

"అరే ఓ హసీనా...! ఏందో తీగరాగాలు తియ్యబడ్తివి? ఇయ్యాల పనిమనిషి సుతరాలే. ఒక్కదాన్ని బండెడు అంట్లు తోమలేక చస్తున్నా. రాణీ సాహెబా... జరవచ్చేదున్నదా లేదా?" అంట్లతో సతమతమవుతూ విసుగ్గా అన్నది ఫాతిమా.

"మా...! ఇయాల అంట్లూగింట్లూ జాన్తానై... బాలోత్సవ్ ముగింపు రోజట... అబ్బాజాన్‌తో నేను గూడపోతున్నా..." తన కిష్టమైన గులాబిరంగు కమీజు, చుడిదార్ వేసుకుంటూ బాత్‌రూంలోంచే తల్లికి వినిపించేట్టు పెద్దగా అన్నది హసీనా.

"అంట్ల తోటి, వంటింటి తోటి, పర్దాల తోటి, చీకటింటి తోటి నువ్వు చేస్తున్నవ్ కద కాపరం? చాలదా? అది నీలాగా చదువూ సంధ్యా లేంది కాదు. తొమ్మిదో తరగతి చదువుతున్నది. దాన్ని కూడా గాలీ వెలుతురూ సోకకుండా ఎందుకు చంపుతావ్?" బిడ్డ తరఫున వకాల్తా పుచ్చుకొని అన్నాడు అన్వర్.

"అంటే... నేను కావాల్ననే యీ వంటింటికి అతక్కపోతన్ననా?" కోపం నషాళానికంటుతుంటే అతి ప్రయత్నం మీద తమాయించుకుంటూ అన్నది ఫాతిమా.

"ఇప్పుడు నీతో గొడవ పెట్టుకునే తీరికా లేదు. ఓపికా లేదు. హసీనా నాతో వస్తున్నది అంతే" అన్నాడు అన్వర్ దృఢనిశ్చయంతో.

ఇక చేసేది లేక నిస్సహాయంగా తనలో తానే ఏదో గొణుక్కొంటూ తిరిగి అంట్లతో మమేకమైంది ఫాతిమా.

హసీనా అయిదు నిమిషాల్లో తయారయింది. తెల్లగా వెన్నెలలా వుండే ముఖానికి లాక్టోకేలమైన్ పట్టించింది. పైన రోజ్ పౌడర్ అద్దుకుంది. ఐబ్రో పెన్సిల్‌తో కనుబొమ్మలు తీర్చిదిద్దుకుంది. కళ్ళకు సుర్మా పెట్టుకుంది. పెదాలకు లిప్‌స్టిక్ పూసుకుంది. జడలో గులాబి పువ్వు తురుముకుంది. సన్నటి మబ్బు తెరమీద నక్షత్రాలు మెరుస్తున్నట్టున్న పల్చటి చునరీ తలమీంచి కప్పుకుంది. పన్నెండు సంవత్సరాల హసీనా చందనపు బొమ్మలా వుంది.

తండ్రీ, కూతురూ కొత్తగూడెం క్లబ్ దారి పట్టారు. రోడ్డు కిరువైపులా బాలోత్సవ్‌కు వస్తున్న ప్రముఖులకు స్వాగతం పలుకుతూ రంగురంగుల బ్యానర్‌లు దర్శనమిస్తున్నాయి. మెయిన్ రోడ్డు మీంచి క్లబ్ వరకు మినీ విద్యుత్తోరణాలు వేలాడుతూ ఆకాశం మీంచి తారలు నేలకు దిగి వచ్చినట్టు భ్రాంతి గొల్పుతున్నాయి.

బాలోత్సవ్‌లో జరిగే అంతర్ పాఠశాలల సాంస్కృతిక పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన బాల బాలికలతో క్లబ్ ఆవరణమంతా ఒక సముద్రం విస్తరించినట్టుగా వుంది. ఎగిసి పడే రంగు రంగు కెరటాల్లా, కదిలే రంగు రంగుల పొదరిండ్లలా, నేల మీద నడయాడుతున్న రంగు రంగు బెలూన్లలా ఎక్కడ చూస్తే అక్కడ కేరింతలతో... తుళ్ళింతలతో పిల్లలే పిల్లలు... సందడే సందడి... అంతా ఒక పండగ వాతావరణాన్ని తలపిస్తున్నది...

కాసేపట్లో ముగింపు ఉత్సవం ప్రారంభమవుతుందని ఎనౌన్స్ చేశారు.

బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాత్రికేయులు, సాహితీవేత్తలు, ప్రసిద్ధ నాట్యా చార్యులు, సంగీత విద్వాంసులు, అధికార్లు, అనధికార్లు, పట్టణ ప్రజలతో ఓపెన్ ఆడిటోరియం కిటటలాడుతున్నది.

రంగు రంగుల తెరలతో, వెలుగులు విరజిమ్మే విద్యుద్దీపాలతో వేదిక నయనానందకరంగా వుంది.

వేదిక మీద ప్రముఖులంతా ఆసీనులై వున్నారు. వందేమాతరం గీతాలాపనతో సభ ప్రారంభమైంది.

మొదట బాలోత్సవ్‌కు రూపకల్పన చేసిన డాక్టర్ రమేష్ బాబు లేచి మైక్ అందుకున్నాడు.

"కొత్తగూడెం అనగానే బొగ్గుగనులు, విద్యుత్‌కేంద్రాలు మాత్రమే గుర్తుకొస్తాయి. కాని ఇక్కడ 'పసి వజ్రా'లను గుర్తించి వాటికి సానపట్టే కార్యక్రమం కూడా మొదలైంది. నేటి యాంత్రిక యుగంలో బాలలు కోల్పోతున్న తమ అమూల్యమైన బాల్యాన్ని తిరిగి వారికి యివ్వాలన్న తపనతో, వారిలో అంతర్గతంగా దాగి వున్న సృజనాత్మక శక్తిని, కళా నైపుణ్యాన్ని వెలికి తీసుకురావాలన్న కోరికతో బాలోత్సవ్ కార్యక్రమాలు రూపొందించబడ్డాయి. మా ప్రయత్నానికి రాష్ట్రమంతా స్పందించింది. పద్దెనిమిది జిల్లాలకు చెందిన ఎనిమిది వేల బాల బాలికలు ఈ బాలోత్సవ్‌లో పాల్గొన్నారు. ఇంతమంది ఒకేచోట కలిసి మెలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల పిల్లల్లో ఏకత్వ దృష్టి, సహజీవనంలో వున్న ఆనందం, తద్వారా వారిలో మానసిక వికాసం పెంపొందుతాయి. ఈ మహాయజ్ఞానికి సహకరించిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు" అని చెప్పి కూచున్నాడు రమేష్‌బాబు.

"రమేష్ బాబుగారు క్షణం తీరికలేని బిజీ డాక్టర్. మీ అమ్మీకి కడుపులో కణితి పెరుగుతుంటే ఆపరేషన్ చేసి తీసివేసింది ఆ డాక్టరే. బాలోత్సవ్ కోసం రెండు నెలలుగా నిద్రాహారాలు మానేసి శ్రమిస్తున్నాడు" అంటూ నెమ్మదిగా హసీనా చెవిలో చెప్పాడు అన్వర్.

'నిజమా?' అన్నట్టు కళ్ళు విప్పార్చి చూసింది హసీనా.

తరువాత ఒక ఎన్నారై - మోహన్ - మైకు ముందుకొచ్చాడు.

"బాల్యంలో నేను ఎన్నో కష్టాలు పడ్డాను. భద్రాచలంలో మా నాన్న నడిపే చిన్న హోటల్లో కప్పులు కూడా కడిగాను. ఇవ్వాళ ఈ ష్తితిలో యీ చిన్నారుల మధ్య నేను పొందుతున్న అనుభూతి మాటలకందనిది. నేను ఎలాంటి అందమైన, ఉత్సాహ పూరితమైన చైతన్య పూరితమైన బాల్యాన్ని కోల్పోయానో మిమ్మల్ని చూస్తుంటే అర్థమవుతున్నది. బాల్యంలో వేసే పునాదే భావిజీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే చిన్నారులకోసం ఏదన్నా చేయాలన్న సంకల్పంతో మా 'మోహన్ ఫ్రెండ్‌స్ ఫౌండేషన్' ప్రతి సంవత్సరం నిర్వహించే బాలోత్సవ్‌కు ఆర్థికంగా, హార్థికంగా సహాయ సహకారాలందించాలని నిర్ణయించింది" అని చెప్పి హర్షధ్వానాల మధ్య కూచున్నాడు.

"చిన్నారులలో దాగి వున్న ప్రతిభను వెలికితీసుకు రావడానికి కొత్తగూడెం క్లబ్ వారు నిర్వహిస్తున్న ఏ బాలోత్సవ్‌ను హృదయ పూర్వకంగా అభినందిస్తున్నాం" అంటూ ముఖ్య అథితిగా విచ్చేసిన మంత్రి వర్యులూ, ఖమ్మం జిల్లా కలెక్టరూ ప్రసంగించారు.

ఇక పిల్లలంతా ఊపిరి బిగబట్టి ఎదురుచూస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

"ఇప్పుడు కుమారి సాగరిక నృత్య ప్రదర్శనతో మన కార్యక్రమం ప్రారంభమవుతుంది" అని రమేష్‌బాబు ప్రకటించారు.

నృత్యానికి తగిన ఆహార్యంతో సాగరిక స్టేజి మీదకొచ్చింది. "సాగరిక హైదరాబాద్‌లోన్ రామంతపూర్‌లో పదవ తరగతి చదువుకుంటున్నది. ఏడవ ఏటనే విద్యుత్ షాక్తో తన కుడి చెయ్యిని పోగొట్టుకుంది. కృషి, పట్టుదల వుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదని, అవిటితనం దేనికీ అడ్డుకాదని సాగరిక నిరూపించింది. ఆమె నాట్యం తిలకించి ఆశీర్వదించండి" అంటూ సాగరికను పరిచయం చేసి తప్పుకున్నాడు ఒక నిర్వాహకుడు.

కళ్ళు మిరమిట్లు గొలొపే ఫ్లడ్‌లైట్ల కాంతిలో ఒక మెరుపుల జలపాతంలా దూసుకొచ్చింది సాగరిక. జవనాశ్వం కదను తొక్కుతున్నట్టు, సుడిగాలి చుట్టి వేస్తున్నట్టు, మహా జలధి ఉప్పొంగుతున్నట్టు తన నృత్యంతో వేదికను దున్ని పారేసింది సాగరిక.

జడివాన కురిసినట్లు చప్పట్లతో ప్రాంగణమంతా మారుమోగిపోయింది.

హసీనా మైమరచి, తన్మయత్వంతో చూస్తున్నది.

"అబ్బా జాన్! ఆ అమ్మాయికి భగవంతుడు అన్యాయం చేసినా పట్టుదలతో తన జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకున్నదో చూడు" అని తండ్రితో ఉద్వేగంగా అన్నది హసీనా.

"అవును బేటీ!" అన్నాడు అన్వర్ తాను కూడా సానుభూతి చుపిస్తూ.

"ఇప్పుడు లక్ష్మి నాయక్ సంప్రదాయ నృత్యంతో మిమ్మల్ని అలరిస్తుంది. ఈ అమ్మాయి ఒక నిరుపేద గిరిజన కుటుంబంలో పుట్టింది. తనలోని కళాతృష్ణకు పేదరికం అడ్డు రాలేదు. పాల్వంచ ఇందిరాప్రియదర్శిని పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుకొంటున్నది. ఆశీర్వదించండి"అంటూ లక్ష్మిని పరిచయం చేశాడు నిర్వాహకుడు.

లక్ష్మి నాయక్ నృత్యం ప్రారంభమైంది.

వినాయక కౌతం,అష్టపది, దశావతారాలు, తిల్లాన మొదలైన అంశాలు అభినయిస్తూ అలవోకగా ఒక దానిలోంచి మరొక దానిలోకి పరకాయ ప్రవేశం చేస్తున్నది లక్ష్మి.

కన్నార్పకుండా, టాన్స్‌లోకి వెళ్ళినట్టు, సమ్మోహితురాలై చూస్తున్నది హసీనా.

కేరింతలతో, చప్పట్లతో అవధులు దాటిన తమ సంతోషాన్ని తెలియజేశారు బాల బాలికలు.

"ఇప్పుడు నవభారత్ పబ్లిక్‌స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్న చిన్నారి సుమిత సత్యభామ అభినయాన్ని చూస్తారు" అని అనౌన్స్ చేశారు.

క్షణాల్లో బ్రహ్మాండమైన రంగు రంగుల సెట్టింగ్ ప్రత్యక్షమయింది. ఆ సెట్టింగ్ మధ్య చిన్నారి సత్యభామ వయ్యారంగా వాలుజడను విసురుకుంటూ "మీరజాలగలడా నా యానతి, వ్రత విధాన మహిమన్ సత్యాపతి" అని పాడుకుంటూ, వగలు పోతూ, దర్పంగా నృత్యం చేస్తున్నది. తన హావభావాలతో, ఆంగిక అభినయంతో, మేని విరుపులతొ, చురకత్తి లాంటి పదునైన చూపుతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నది.

చప్పట్లతో తమ ఆనందాన్ని తెలియజేశారు ప్రేక్షకులు.

"అంత చిన్న అమ్మాయి ఎంత బాగా నృత్యం చేసింది అబ్బాజాన్!" అసలే పెద్దగా వున్న కళ్ళను ఇంకా పెద్దవి చేస్తూ ఆశ్చర్యంగా అన్నది హసీనా.

"చిన్నప్పటి నుండే తల్లిదండ్రులు ఆమెకు మంచి శిక్షణ యిప్పించారు" అని పైకి అన్వర్ అన్నాడు గానీ అతనికీ ఆశ్చర్యంగానే వుంది.

"ఇప్పుడు వరంగల్‌కు చెందిన కుమారి అలేఖ్య తన గాన మాధుర్యంతో మిమ్మల్ని పరవశింప చేస్తుంది" అన్న అనౌన్స్‌మెంట్ వినిపించింది.

అలేఖ్య స్టేజి మీదకి వచ్చి సభకు నమస్కరించింది.

ఆమెను పరీక్షగా చూసి "అబ్బాజాన్! ఈ అమ్మాయి జీ టీవీలో లిటిల్ ఛాంప్స్ ప్రోగ్రాంలో టాపర్‌గా నిలిచిన అమ్మాయే కదూ?" అని మనసులో ఉప్పొంగుతున్న ఉత్సాహాన్ని ఆపుకోలేక తండ్రితో అన్నది హసీనా.

"అవునవును" తనూ ఉత్సాహంగానే అన్నాడు అన్వర్.

అలేఖ్య ఒక్కొక్క రాగాన్నే వివరిస్తూ కీర్తనలు ఆలపించడం మొదలెట్టింది.

మొదట ముత్తుస్వామి దీక్షితార్ కీర్తన 'వాతాపి గణపతింభజే'ని హంసధ్వని రాగంలో ఆలపించింది. తరువాత 'పాహిమాం శ్రీ రాజ రాజేశ్వరి' అన్న త్యాగరాజ కీర్తనను సంతురావళి రాగంలో భక్తి పారవశ్యంతో శ్రావ్యంగా పాడింది. 'ఎందరో మహానుభావులు'అన్న కృతి శ్రీరాగంలో ఆమె గళం నుండి జాలువారింది. ఆ తరువాత 'సామజ వరగమనా' అన్న కీర్తనను జనరంజకంగా వినిపించింది. చివరగా 'పలుకే బంగారమాయెనా - కోదండరామా' అన్న భక్త రామదాసు కృతిని రసరమ్యంగా రక్తి కట్టించింది.

సముద్రపు హోరు శ్రుతి చేసుకున్నట్టు, జలపాతం సప్త స్వరాలతో గమకాలు పలికించినట్టు, ఎవరో దేవకన్య వేయితంత్రుల వీణను మధురాతిమధురంగా మీటుతున్నట్టు తన గాంధర్వ గానంతో మంత్రముగ్ధుల్ని చేసింది అలేఖ్య.

సముద్రం ఉప్పొంగినట్టు చప్పట్ల రణగొణధ్వని ప్రాంగణాన్ని ముంచెత్తింది.

విజయవాడకు చెందిన విద్యార్థినులు 'కోటి కోటి జెండా...' అన్న దేశభక్తి గేయం ఆలపిస్తుంటే ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకున్నాయి.

రాత్రి ఒంటి గంట కావస్తున్నా ఒక్కరూ ప్రాంగణాన్ని విడిచిపెట్టిపోలేదు.

వివిధ పోటీలలో విజేతలైన బాల బాలికలకు మంత్రివర్యులు జ్ఞాపికలూ, ప్రశంసాపత్రాలూ బహూకరిస్తుంటే వేదిక ముందు కూర్చున్న చిన్నారులు వింతవింత ధ్వనులతో, ఈలలతో, కేరింతలతో,చప్పట్లతో కోలాహలంగా మిన్నుముట్టే హర్షధ్వానాలు చేశారు.

చివరగా 'జనగణమన' ఆలపిస్తుంటే కార్యక్రమం అప్పుడే అయిపోయిందా అని అనిపించింది. ఒక స్వర్గమేదో జారిపోయినట్టు, స్వప్నమేదో తొణికిపోయినట్టు ఏదో తెలియని దిగులు హసీనా మనసంతా ఆక్రమించింది.

క్రిక్కిరిసిన ప్రేక్షకులు ప్రాంగణం విడిచిపెట్టి బయటకి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది. జనం పలచబడ్డాక వెళ్ళొచ్చని హసీనా, అన్వర్ తమ సీట్లముందు అలాగే నుంచున్నారు.

"అబ్బా జాన్!" అని మెల్లగా తండ్రిని పిలిచింది హసీనా.

"ఏంటి బేటీ?" అడిగాడు అన్వర్.

"రాష్ట్రమంతటి నుండి ఇన్ని వేలమంది బాల బాలికలు వచ్చి బాలోత్సవ్‌లో పాల్గొన్నారు కదా... మరి... ఒక్క ముస్లిం అమ్మాయి కూడా కనబడినట్టు లేదు..." లోలోన ఏదో అసంతృప్తి తనను తొలిచి వేస్తుండగా అన్నది హసీనా.

నిజమే. తనకా ఆలోచనే రాలేదు అనుకున్నాడు అన్వర్. రాష్ట్రమంతటికీ పరివ్యాప్తమైన ఈ ఉత్సవానికి ఒక ముస్లిం అమ్మాయి కూడా రాక పోవడం ఆశ్చర్యంగానే వుంది. ప్రపంచమంతా ఎటు పోతున్నది? ముస్లిం సమాజం ఎటు ప్రయాణిస్తున్నది. మనసులో ఏవేవో ప్రశ్నలు... ఏవేవో జవాబులు... గొలుసుల్లా అతుక్కుంటూ విడిపోతున్నవి. తన కూతురు అడిగిన ప్రశ్నకు ఒక్క ముక్కలో జవాబు చెప్పగలడా తను...?

"తర్వాత మాటలాడుకుందాంలే బేటీ!" అని సమాధానం దాట వేశాడు అన్వర్.

ఇద్దరూ మౌనంగా ఇంటి దారి పట్టారు.

అయిదారు రోజుల దాకా హసీనా ఆ మౌనంలోంచి బయట పడలేక పోయింది.

ఆ లేత మనసులో ఏదో పెనుగులాట. ఏదో అలజడి. అల్లకల్లోలంగా ఆలోచనలు ఎగిసిపడుతున్నాయి. ఏదో విచారం ఆమెలో సుళ్ళు తిరుగుతున్నది. ఆ దిగులులోంచి, ఆ అలజడిలోంచి ఏవేవో కలలు పురివిప్పుకుంటున్నాయి.ఏవో ఆశలు రెక్కలు విప్పుకుంటున్నాయి.

"ఏంటే హసీనా? బాలోత్సవ్‌కు పోయి వచ్చిందగ్గర్నుంచి ఏందో దయ్యం పట్టిందాన్ని లెక్కవున్నవ్? ఒక మాట లేదు. ముచ్చట లేదు. మూగిదాని తీర్గ ఖామోష్‌గున్నవ్? నీకు నువ్వే ఏందొ గొణుక్కుంటున్నవ్... ఏంది సంగతి?" అన్నది ఫాతిమా ఆరా తీస్తూ.

ఓ సారి తల్లి వైపు చూసింది హసీనా. తన చూపు గిరికీలు కొట్టుకొంటూ తిరిగి తన కళ్ళకే చేరుకున్నట్టు అనిపించి చూపు నేలకు దించుకుంది.

"ఏందే? ఏం జరిగింది?" రెట్టించింది ఫాతిమా.

"ఏం లేదు... ఏం లేదు" తడబడింది హసీనా.

"ఏం లేదంటవ్... మల్ల మూగి ముత్యాలమ్మోల్లె మాట్లాడవ్...? ఏం జెయ్యాల్నె నీతోటి?" విసుక్కుంది ఫాతిమా.

"అమ్మీ జాన్...!" హసీనాకు గొంతు పెగలి మాటలు రావటం లేదు.

"జల్ది చెప్పి చావు" అసహనంగా అన్నది ఫాతిమా.

"అమ్మీ జాన్... నేను... నేను... సంగీతం నేర్చుకుంట" ఒక్కొక్క మాటే కూడగట్టుకొని చెప్పేసరికి బ్రహ్మప్రళయమైంది హసీనాకు.

తన మీద పిడుగు పడ్డట్టు అదిరిపడింది ఫాతిమా. రెండు క్షణాలు ఆమె మెదడు పనిచేయలేదు. నెమ్మదిగా తేరుకోవడానికి ఐదారు నిమిషాలు పట్టింది.

"సంగీతం నేర్చుకుంటదట... సంగీతం... మసీదులు నడుపుతున్న 'మదరసా'కు పోవే... తరీఖా నేర్చుకోవే... అని నెత్తిన నోరు పెట్టుకొని మొత్తుకుంటున్నా అది మాత్రం చాతకాదు..." హసీనాను మింగేటంత కోపం వస్తున్నా అతి ప్రయత్నం మీద తమాయించుకుంటూ అన్నది ఫాతిమా.

అప్పుడే బజార్నుంచి యింట్లో కొస్తున్న అన్వర్‌కు ఫాతిమా అన్న మాటలు చెవిన పడనే పడ్డాయి. తల్లీ కూతుళ్ళకు ఏదో యుద్ధం జరుగుతున్నదని గ్రహించాడు.

"దానికి కల్మలు వచ్చు. నమాజు చెయ్యడం వచ్చు. ఖురాన్ చక్కగా చదువుతుంది. ఇంకెందుకే మదరసాకు వెళ్ళడం?" బిడ్డను వెనకేసుకొస్తూ అన్నాడు అన్వర్.

"అహ... మదరసా కొద్దు. బిడ్డకు గానా భజానాలు కావాల్నంట. పంపండి..." అన్నది ఫాతిమా వెటకారంగా.

"అదన్నదా?" అన్వర్ కనుబొమ్మలు ముడిపడ్డాయి.

"అడగండి దాన్నే" అన్నది ఫాతిమా.

"అవునా?" అన్నట్టు కూతురి వైపు చూశాడు అన్వర్.

"అవును" అన్నట్టు కళ్ళు కిందకి దించుకొని నేల మీద కాలి బొటన వేలితో రాస్తూ తలపంకించింది హసీనా.

కొన్ని క్షణాల పాటు అవాక్కయ్యాడు అన్వర్. వెంటనే తేరుకున్నాడు. ఇన్నాళ్ళూ తన కూతురి మనసులో ఏముందో తెలుసుకోలేక పోయినందుకు కొంచెం అపరాధ భావనకు లోనయ్యాడు. బాలోత్సవ్‌లో సీతాకోక చిలుకల్లా, తూనీగల్లా స్వేచ్చగా విహరించిన చిన్నారులు అతని మనసులో మెదిలారు. హసీనాది కూడా అలా ఆడేపాడే వయసే కదా అనుకున్నాడు. ఆ పసి మనసులో అంకురించిన ఉత్సాహాన్ని చిదిమేసే హక్కు తమకు లేదని భావించాడు.

"పోనీ... దానిష్ట ప్రకారమే సంగీతం నేర్పిస్తే పోలే..." అన్నాడు అన్వర్ మెల్లగా.

గయ్యిమని ఇంతెత్తు లేచింది ఫాతిమా.

"మన ఖాన్‌దాన్, మన సిల్‌సిలా, మన ఖౌమ్... మన మజహబ్ ఏంటో తెలిసే మాట్లాడుతున్నారా...?" అన్నది అరచినట్టు పెద్దగా.

కాసేపటిదాకా అన్వర్ ఏం మాట్లాడలేదు.

'మజహబ్... ఖౌమ్... యీ పెద్ద పెద్ద మాటలు వల్లించే పెద్ద మనుషులంతా ఏం చేస్తున్నారు...? తమ సంతానాన్ని అమెరికా, ఇంగ్లండ్‌లాంటి పెద్ద పెద్ద దేశాల్లో చదివిస్తున్నారు. డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, లాయర్లుగా తయారు చేసి డాలర్ల పంట పండించుకుంటున్నారు. పేద ముస్లింలు మదరసాల్లో మత విద్యలు నేర్చుకుంటూ, కార్ఖానాల్లో గ్రీజు పూసుకుంటూ, హోటళ్ళలో చాయ్‌లందిస్తూ, హరేక్ మాల్ బండ్లతో, పాన్ డబ్బాలతో ఫుట్‌పాత్‌ల మీద కాలక్షేపం చేస్తున్నారు. మతం పేరుతో రాజకీయాల్ని నడుపుతూ తమ ప్రయోజనాల కోసం సామాన్య ముస్లింలను పావులుగా వాడుకుంటున్నారు యీ ఘరానా మనుషులు. భగవంతుణ్ణి చేరేందుకు మతం ఒక మార్గం మాత్రమే. అదొక విశ్వాసం. ఒక జీవన శైలి. ఏ మత పిచ్చయినా ముదిరితే ప్రమాదమే. మక్కా మసీదు, లుంబినీ పార్కు, గోకుల్‌చాట్‌లలో ఏం జరిగింది? గుజరాత్ గాయం అప్పుడే మానిపోయిందా? మతం పేరుతో మనుషులు విడిపోవడం భావ్యమా...?

కాశీ పట్టణం ఒకవైపు గంగా ప్రవాహంలో మరో వైపు బిస్మిల్లా ఖాన్ షహనాయీ నాదస్వర లహరిలో ఓలలాడి తరించ లేదా? మడి కట్టుకొని కూచొని వుంటే సానియా మీర్జా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి కాగలిగేదా? షేక్ ఆదం సహెబ్, మహబూబ్ సుబాని, షేక్ చిన మస్తాన్ నాదస్వర విద్వాంసులుగా అంత కీర్తి గడీంచేవారా? కళలకు ఎల్లలు లేవు. కులమతాల పట్టింపులు లేవు. ఎవరిలో ఏ సృజనాత్మక శక్త్, ఏ కళా నైపుణ్యం దాగున్నదో? ఎవరు చెప్పగలరు. రేపు తన కూతురు ఒక లతా మంగెష్కరో.. ఒక నూర్జహానో... కాగలదేమో! మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా...' తనలో జరుగుతున్న అంతర్మథనం లోంచి తేరుకొని ఒక నిర్ణయానికొచ్చాడు అన్వర్.

"ఏయ్ ఫాతిమా! నీ ఫాల్తు మాటలు కట్టి పెట్టు. హసీనా రేపటి నుండి సంగీతం నేర్చుకుంటుంది" అని గంభీరంగా అన్నాడు అన్వర్. అతని గొంతులోని దృఢత్వాన్నీ, తీవ్రతనూ గమనించిన ఫాతిమా ఇక అతని నిర్ణయానికి తిరుగుండదు అని గ్రహించింది.

"యా అల్లా...! యా ఖుదా...!" అని పెద్దగా నిట్టూర్చి, నొసలు బాదుకుంటూ వంటింట్లోకి దూరింది ఫాతిమా.

అంతసేపూ ఏమవుతుందో అన్న ఉత్కంఠతతో, ఆందోళనతో, ఉద్వేగంతో ఊపిరి బిగబట్టొ వున్న హసీనా తండ్రి మాటలకు సంతోషంతో ఉక్కిరిబిక్కిరయింది. ఆ చిన్నారిలో తొంగిచూస్తున్న చిన్న ఆశ వూపిరి పోసుకుంది. కనుగుడ్ల మీద పల్చటి నీటి పొర కదలాడుతుండగా "అబ్బా జాన్...!" అంటూ తండ్రిని బిగ్గరగా కౌగిలించుకుంది.

[సాహిత్య ప్రస్థానం ఫిబ్రవరి 2008 సంచికలో ప్రచురితం]